రేవంత్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో పాలనా పరంగా తను పూర్తిగా విఫలం చెందాడని ఆరోపించారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని, కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర లేపాడని, అంతే కాకుండా సీఎం బ్రదర్స్ తో కలిసి దందాలకు శ్రీకారం చుట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని, తెలంగాణ సమాజం ఊరుకోదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సినిమా రంగానికి సంబంధించి కూడా సీఎం బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు.
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ పైన పెద్ద ఎత్తున జులుం చలాయిస్తున్నాడని ఆరోపించారు. సినిమా వాళ్ళని భయపెట్టి.. లొంగదీసుకొని అవినీతికి పాల్పడుతూ, డబ్బులు దండుకుంటున్నట్లుగా కనిపిస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. నచ్చిన వాళ్లకు నజరానా, నచ్చని వాళ్ళకి జుర్మానా అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి.






