ఐసీసీకి స్పష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు
బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీలక ప్రకటన చేసింది. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా తాము ఇండియాలో జరిగే కీలక మ్యాచ్ లను ఆడేది లేదంటూ పేర్కొంది. భారత్ తో బంగ్లాదేశ్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని, అక్కడికి వెళ్లి ఆడే పరిస్థితి ప్రస్తుతం లేదని తెలిపింది . బుధవారం ఐసీసీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో బీసీబీ సభ్యులు పాల్గొన్నారు. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ ఆటగాళ్ల పట్ల భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుండి వైదొలగమని బీసీసీఐ బలవంతం చేయడంతో వివాదం చెలరేగింది.
గత ఎడిషన్లలో ఇతర జట్ల తరపున ఐపీఎల్‌లో ఆడిన ముస్తాఫిజుర్‌ను డిసెంబర్‌లో జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా తనను రూ. 9.20 కోట్లకు తీసుకుంది. తనను తొలగించడం పట్ల బంగ్లాదేశ్ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇకనుంచి ఇండియాతో జరిగే మ్యాచ్ లను ఇండియాలో ఆడకూడదని, ఒక రకంగా రాబోయే రోజుల్లో కేవలం తటస్థ ప్రదేశాలలో అయితేనే తాము ఆడతామని ప్రకటించింది. బంగ్లాదేశ్ మ్యాచ్‌లను భారతదేశం వెలుపల మార్చడాన్ని పరిగణించాలని ICCకి చేసిన అభ్యర్థనను పునరుద్ఘాటించింది. అయితే టోర్నీ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే మ్యాచ్ లను, తేదీలను ఖరారు చేశామని తెలిపింది. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ బోర్డు పునరాలోచించాలని సూచించింది ఐసీసీ.








