కుట్రకు తెర లేపిన గురు శిష్యులు
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గురు, శిష్యులు కలిసి కొత్త కుట్రలకు తెర లేపారంటూ ఆరోపించారు. జిల్లాల పునర్విభజన పేరుతో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారని, వారి కుట్రలను తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించ బోదంటూ ప్రకటించారు హరీశ్ రావు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ఆనాడు జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజా పాలన పేరుతో దగా పాలనకు తెర తీశాడని ధ్వజమెత్తారు. సీఎంగా సోయి లేకుండా జల్సాలకు అలవాటు పడ్డాడని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను ఎత్తివేసే కుట్ర చేస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్ రావు.
ఆనాడు జోనల్ వ్యవస్థ కోసం కేసీఆర్ 7 ఏళ్ళు పోరాటం చేశారని అన్నారు. కేసీఆర్ కృషితో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు దక్కాయని అన్నారు. రేవంత్ రెడ్డి కొత్త జిల్లాకు జైపాల్ రెడ్డి పేరు పెడతామని అంటున్నారని, చుట్టాల పేర్లు పెట్టుకోవడానికి జిల్లాల మార్పునకు కమిషన్ వేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కాళేశ్వరం లో భాగమైన మేడిగడ్డ ను రిపేర్ చేయకుండా పల్లెలను ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు హరీశ్ రావు. హైడ్రా పేరుతో పట్టణ , పేదల జీవితాలను ఆగం చేశారని వాపోయారు . జిల్లాలు ,రెవెన్యు డివిజన్లు మండలాల మార్పు తో రియల్ ఎస్టేట్ ను దెబ్బ తీయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.






