తెర లేపారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డిపై. వికేంద్రీకరణ పేరుతో తెలంగాణ విధ్వంసానికి కుట్రకు తెర లేపాడని ఆరోపించారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడని అన్నారు. ఆనాడు పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాల వారీగా ఇప్పటికే ఉద్యోగుల విభజన జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి జిల్లాల తేనె తుట్టెను కదప బోతున్నారని, ఆయన కదిలిస్తే సీటు నుంచి దిగి పోవడం ఖాయమని హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు కేటీఆర్. ఇప్పటికే నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారని అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు, తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రకు పాల్పడితే పుట్టగతులు ఉండవని అన్నారు.
ఎన్టీఆర్ పెట్టిన మండలాలతో లాభం జరగలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ చేసిన జిల్లాల మీద కడుపు మంట ఎందుకు అంటూ నిలదీశారు. ఎన్నికలు ముందు దేవుళ్లులాగా మాట్లాడి ఇప్పుడు మారీచుల్లాగా మారారంటూ ఆరోపించారు కేటీఆర్. రాష్ట్రంలో పేరుకు పోయిన సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ ఫైర్ అయ్యారు. ఇక నుంచి జిల్లాల పునర్విభజనపై బిఆర్ఎస్ పోరాటం చేస్తోందని ప్రకటించారు. మీకు ఇష్టం వచ్చినట్లు జిల్లాలు చేస్తే ఒప్పుకోమని అన్నారు. ఉద్యోగులకు ఒక డీఏ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ధ్వజమెత్తారు. బకాయిలు చెల్లించక పోవడంతో ఇప్పటి వరకు 140 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.






