సీఎంపై నిప్పులు చెరిగిన జగన్ రెడ్డి
అమరావతి : ఏపీలో రాచరిక పాలన సాగుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన సాల్మాన్ ను కావాలని చంపేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. అధికార పార్టీ అరాచకాలు, దాడుల దెబ్బకు తట్టుకోలేక పిన్నెల్ల గ్రామంలోని వారంతా ఇతర ప్రాంతాలకు భయంతో వెళ్లి పోయారని తెలిపారు. ఇదేనే మీ ప్రజా పాలన అని ప్రశ్నించారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయని ఆవేదన చెందారు జగన్ రెడ్డి.
ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా మారణకాండను ప్రోత్సహించారని మండిపడ్డారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడ్డం మీ బాధ్యత కాదా? అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం, పైగా మీరే మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి హత్యా రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా? అని జగన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా? చంద్రబాబూ హింసా రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరని హెచ్చరించారు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందన్నది ఎప్పుడూ మరిచి పోవద్దని అన్నారు.






