ప్రధానమంత్రి మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణ పట్ల శీతకన్ను ప్రదర్శిస్తోందని ఆవేదన చెందారు. గత ప్రభుత్వంపై ఉన్న కక్ష ఇంకా తగ్గలేదన్నారు. రాష్ట్రం ఏర్పాటై పది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేయక పోవడం దారుణం అని అన్నారు సీఎం. బీఆర్ఎస్ హయాంలో కేంద్రంతో రాజీ ధోరణి కాకుండా ఘర్షణ వాతావరణం కొనసాగించడం వల్ల చాలా మటుకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇంకా అలాగే ఉండి పోయాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి, మంత్రులు తమకు సహకరించాలని కోరారు రేవంత్ రెడ్డి.
ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆగి పోవడం వల్ల పలు అభివృద్ది పనులు నిలిచి పోయాయని, పాలన ఆర్థిక పరంగా కుంటు పడిందన్నారు సీఎం. అయితే రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువు తీరాక ప్రజా పాలనకు శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రాన్ని నిట్ట నిలువునా ఆర్థికంగా నాశనం చేశాడని ఆరోపించారు. వ్యవస్థలన్నీ నిర్వీర్యమై పోయాయని , వాటిని చక్కదిద్దేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందని అన్నారు.






