అస్తిత్వానికి భంగం కలిగిస్తే ఊరుకోం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శనివారం ఆయన మీడియాతో హైదరాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారని అన్నారు. అయినా అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోరిక మేరకు, ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళుతున్నామని అన్నారు. కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి, ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని, కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్లను, పార్టీ సీనియర్ నాయకులను, సాధారణ ప్రజలను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు కేటీఆర్.
ఇంత అరాచకంగా, అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి అధికారం శాశ్వతం కాదు అని హెచ్చరించారు. ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగడు రేవంత్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెరిపివేసే ప్రయత్నం మానుకోవాలని హితవు పలికారు కేటీఆర్. ఇవాళ శాంతి ర్యాలీని భగ్నం చేశామని చెప్పి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందవచ్చు. కానీ ఇది తాత్కాలికమేనని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగ బద్ధంగా నిరసన తెలిపే మా హక్కును కచ్చితంగా ఉపయోగించుకుంటూ మరోసారి కోర్టుకు వెళ్లి శాంతి ర్యాలీ నిర్వహించి తీరుతామని హెచ్చరించారు కేటీఆర్.





