స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీలో టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ పరిశ్రమల ఏర్పాటుకు సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని తెలిపారు. స్వంత ఊరిలో సంక్రాంతి పండుగను జరుపు కోవడం మరింత ఆనందం కలిగించిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయని తెలిపారు. ప్రజలు దేశ విదేశాల నుంచి తరలి వచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల గొప్ప తెలుగు సంప్రదాయాన్ని మరోసారి ఘనంగా చాటారని ప్రశంసించారు. ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి జన్మభూమికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, సొంత గ్రామస్తులతో గడిపే సాంప్రదాయంలో భాగంగా నేను కూడా నా కుటుంబంతో కలిసి నారావారిపల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నానని అన్నారు చంద్రబాబు నాయుడు.
ఇది ఎంతో సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో జగ్గన్నతోట ప్రభల తీర్థం కార్యక్రమాన్ని ఈసారి రాష్ట్ర పండుగగా జరుపుకున్నాం అని తెలిపారు. ఏకాదశ రుద్రులు ఒక్క చోట చేరారని, లక్షల మంది భక్తులు పాల్గొన్నారని, ఘనంగా నిర్వహించడం జరగిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. వైభవోపేతంగా జరిగిన ప్రభల పండుగ మన సంస్కృతిని చాటి చెప్పిందన్నారు ఇదే సమయంలో కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ తో ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు.





