తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగిన కేటీఆర్
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన సీఎంను, సర్కార్ ను ఏకి పారేశారు. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి వ్యవహారంపై నిలదీసినందుకే హరీష్ రావును టార్గెట్ చేశారని ఆరోపించారు. సిట్ పేరుతో ఏడు గంటల పాటు విచారణ జరపడం పై మండిపడ్డారు. సింగరేణిని ఒక బంగారు బాతు లాగా చూసి దీని నుంచి నిధులు, డబ్బులు కొల్లగొట్టేందుకు ఒక నిబంధన తీసుకు వచ్చారన్నారు. టెండర్లు వేసిన కంపెనీ కచ్చితంగా సైట్ విజిట్ చేయాలి అన్న నిబంధన దేశంలో ఎక్కడా లేనివిధంగా పెట్టారని ఆరోపించారు. సింగరేణి అధికారుల నుంచి సైట్ విజిట్ సర్టిఫికెట్ తీసుకోవాలని అన్నారు. సైట్ విజిట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కంపెనీ సమాచారం, ఆ కంపెనీ డైరెక్టర్ల సమాచారం తీసుకుని బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి స్వయంగా అందరినీ బెదిరిస్తున్నాడని ఆరోపించారు. సర్టిఫికెట్ కోసం ఎవరైనా బెదిరింపులకు లొంగకుండా ఉంటే, సైట్ విజిట్ సర్టిఫికెట్ అర్హులైన కంపెనీలకు ఇవ్వడం లేదన్నారు. భట్టి విక్రమార్క రద్దు చేశామని చెప్తున్న నాయని కోల్ బ్లాక్స్ వెనుక కూడా ఇదే అక్రమ దందా కొనసాగుతోందని ఆరోపించారు. ఇతర కంపెనీలను అందరిని బెదిరించి ఎక్కువ అంచనా విలువకు టెండర్లు వేయడం జరిగిందన్నారు. అందుకే సృజన్ రెడ్డి కంపెనీకి కూడా అధిక విలువకు టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు. ఈ మొత్తం సింగరేణి అంశంలో ప్రధాన ముద్దాయి సృజన్ రెడ్డి అని అన్నారు. ఈ సింగరేణి దొంగతనంలో బీజేపీకి వాటాలు లేకుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.





