ఆవేదన వ్యక్తం చేసిన ఎంపీ రాహుల్ గాంధీ
హర్యానా : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పై మండిపడ్డారు. ఆయన కొలువు తీరాక ఇండియా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రధానంగా వస్త్ర పరిశ్రమ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోందన్నారు. ఇదిలా ఉండగా హర్యానా రాష్ట్రంలో పర్యటించారు రాహుల్ గాంధీ. పర్యటనలో భాగంగా హర్యానాలోని ఒక వస్త్ర కర్మాగారాన్ని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సందర్శించారు. భారతదేశం సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ యొక్క దయనీయ వాస్తవికతను బయట పెట్టిందన్నారు.
భారతదేశ వస్త్ర పరిశ్రమ దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి కల్పనా రంగంగా ఉండేదన్నారు రాహుల్ గాంధీ. ఆనాడు కోట్లాది మందికి ఉపాధి కల్పించిన ఈ వస్త్ర పరిశ్రమ రంగం ఇప్పుడు అనిశ్చితితో కొట్టు మిట్టాడుతోందన్నారు . ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ లోపం , అసంబద్ద నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ నిర్వాకం కారణంగా వస్త్ర , టెక్స్‌టైల్ ఎగుమతిదారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వాపోయారు, దీనివల్ల కర్మాగారాల మూసివేతలు, కొనుగోళ్లు తగ్గడం ,పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు జరుగుతున్నాయని అన్నారు. ఈ రంగం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు రాహుల్ గాంధీ.
అయినప్పటికీ, 4.5 కోట్లకు పైగా కార్మికుల మరియు లక్షలాది వ్యాపారాల జీవనోపాధి ప్రమాదంలో ఉన్నప్పటికీ, ప్రధాని మోడీ ఉపశమనం కల్పించే చర్యలు లేవన్నారు. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలైనా చేయాల్సి ఉండేదన్నారు.






