తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్
హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లి స్టేషన్ రోడ్డులో గత శనివారం బచ్చాస్ ఫర్నీచర్ షోరూంలో అగ్ని ప్రమాదం సంభవించడం, ఐదుగురు మృతి చెందిన ఘటన తర్వాత కూడా అదే రోడ్డులో ఉన్న దుకాణ దారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తీవ్రంగా పరిగణించారు. నాంపల్లి స్టేషన్ రోడ్డులో రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నీచర్ దుకాణం ఉన్న భవనం 6 అంతస్తులు ఉండగా సెల్లార్‌తో పాటు మొత్తం అన్ని అంతస్తుల్లో భారీగా ఫర్నీచర్ నిలువలుంచడం.. మెట్ల మార్గాన్ని కూడా మూసేసిన విధంగా స్టాక్ పెట్టడం పట్ల హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైర్ ఎన్‌వోసీ లేకపోవడంతో పాటు 6 అంతస్తుల్లో ఎక్కడా ఫైర్ ఎక్స్టింగ్విషర్లు కనిపించక పోవడాన్ని సీరియస్‌గా పరిగణించారు. మొత్తం 6 అంతస్తులు తనిఖీ చేసి ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎక్కడా కానరాక పోవడంతో సీజ్ చేయాలని ఆదేశించారు.
ఈమేరకు హైడ్రా, జీహెచ్ ఎంసీ, ఫైర్ విభాగంతో పాటు విద్యుత్ శాఖకు చెందిన అధికారులు చర్యలు తీసుకున్నారు. వెంటనే విద్యుత్ సరఫరా ఆపేశారు. ఆ భవనంలో వ్యాపార లావాదేవీలు జరగకుండా నిలిపేశారు. ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎవరైనా గమనిస్తే హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667 నంబరుతో పాటు నేరుగా తన నంబరు 7207923085 కు సమాచారం ఇవ్వాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను కోరారు. షాపులను గోదాములగా మార్చేసి వారి వ్యాపార వస్తువులను అందులోనే నిలువలుంచడం, సెల్లార్లలో భారీ మొత్తంలో అగ్ని ప్రమాదానికి కారణమైన వస్తువులు పెట్టినట్లయితే సంబంధిత షాపు, వ్యాపార సముదాయాల వివరాలతో పాటు.. ఏ ప్రాంతంలో ఉన్నదీ స్పష్టంగా పేర్కంటూ వాట్సాప్ ద్వారా, ఫొటోలు, వీడియోలు పంపాలని సూచించారు. Commissioner_HYDRAA పేరిట ఉన్న ఎక్స్ (ట్విట్టర్)లోనూ ఫిర్యాదు చేయాలని హైడ్రా కమిషనర్ కోరారు.






