విప్లవ గాయకుడు గద్దర్ జయంతి ఇవాళ
హైదరాబాద్ : జీవితమంతా జనం కోసం గానం చేసిన వాడు. అణగారిన ప్రజల గొంతుకగా మారిన వాడు గద్దర్. తన ఆట పాటలతో కోట్లాది ప్రజలను ఉర్రూత లూగించడమే కాదు ప్రభావితం చేసిన అరుదైన గాయకుడు. అందుకే ఆయనను అంతా ప్రజా వాగ్గేయకారుడిగా గుర్తు పెట్టుకుంటారు. తెలంగాణ మలిదశ పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. అంతే కాదు ఉమ్మడి ఏపీలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, ఎలా దోపిడీకి గురైందో తెలంగాణ ప్రాంతం గురించి తన పాటలతో తెలియ చెప్పాడు. ఆయన పాటల తో ప్రభావితం అయిన వాళ్లు లెక్కకు మించి ఉన్నారు. జనవరి 31న ఆయన జయంతి. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. సంగారెడ్డి జిల్లాలోని తూఫ్రాన్ తన స్వస్థలం. తన తల్లి లచ్చుమమ్మ మీద రాసిన పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉండి పోతుంది.
నక్సలిజంకు మద్దతు ఇచ్చినా , పాటలు పాడినా అంతా జనం కోసమే. తనపై కాల్పులు జరిపిన రోజు ప్రభుత్వం భయపడింది. చివరకు తను చని పోయిన సమయంలో ఆనాటి , ఇప్పటి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి చూశాడు. ఇంకా ఊపిరి తనలో ఉందేమోనని. తన ఆట పాటలతో రాజ్యం గుండెల్లో గుబులు రేపాడు గద్దర్. తన అంతిమ సంస్కారం సమయంలో వేలాది ప్రజలు స్వచ్చంధంగా తరలి వచ్చారు ఆ ప్రజా గాయకుడిని చివరి చూపు చూసేందుకు. తను పాడని పాట లేదు. వినని పల్లె లేదు. ప్రేమించని మనిషి లేడు. తెలంగాణ మాగాణంలో మొలకెత్తిన గాయకుడు, పోరాట యోధుడు, భూమి పుత్రుడు గద్దరన్న. పాట ఉన్నంత కాలం, సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత కాలం ప్రజా యుద్ద నౌక బతికే ఉంటాడు. మనల్ని పాటై తాకుతూనే ఉంటాడు.






