మహనీయుడన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం, పేదల హక్కుల కోసం పోరాటం చేయడమే కాదు, సర్వం త్యాగం చేసిన మహనీయుడు రావి నారాయణ రెడ్డి అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి “రావి నారాయణరెడ్డి జాతీయ పురస్కార” ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.
న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజల హక్కుల కోసం పని చేసిన, రాజ్యాంగం పట్ల సంపూర్ణ నిబద్ధత కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ఈ అవార్డు ప్రదానం చేయడం అత్యంత సముచితం అని అన్నారు రేవంత్ రెడ్డి.
నేడు దేశంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. ఇవాళ రాజ్యాంగం ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆ విషయాన్ని గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





