శ్రీకారం చుట్టిన కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ మహా నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నాంపల్లి లోని ఫర్నీచర్ షో రూంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో హైడ్రా అప్రమత్తం అయ్యింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా నగరంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని గుర్తించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపై నియమ నిబంధనలు పాటించని షాపులకు తాళాలు వేశారు. ఇదే సమయంలో ఫైర్ సేఫ్టీ పై అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు హైడ్రా , ఇతర శాఖల సమన్వయంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో అవగాహన శిబిరాలు చేపట్టారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా వ్యవహరించాలి, ఎలా బయట పడాలనే దానిపై వివరించారు. కార్మికులు,వ్యాపారులు ఎలా భద్రంగా ఎలా బయట పడాలో సూచించారు. షాపులలో ఫైర్ ఎగ్జిట్ మార్గాలను గుర్తించడం.. మంటలు అంటుకుంటే అగ్ని మాపక శాఖకు చెందిన 101తో పాటు.. హైడ్రా కంట్రోల్ రూమ్ 1070తో పాటు 9000113667 కు ఫోను చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఫైర్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు.





