నా ఇంటికి ఎందుకు వచ్చారంటూ ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన నిరుద్యోగులపై మండిపడ్డారు. తన ఇంటికి వచ్చిన నిరుద్యోగ సంఘాల నాయకులపై భగ్గుమన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించడంతో ఆయన కంట్రోల్ తప్పారు. ఇంకెంత కాలం ఆగాలంటూ కోదండ రాం రెడ్డిని నిలదీయడంతో ఆయన సహనం కోల్పోయారు. ప్రభుత్వంపై మాట్లాడకుండా బాధితులైన నిరుద్యోగులపై మండిపడడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యానికి లోనయ్యారు. నా ఇంటికి ఎందుకు వచ్చారంటూ ఫైర్ కావడంతో నిరుద్యోగులు అవాక్కయ్యారు. ఓట్ల కోసం తాను ఎప్పుడూ నిరుద్యోగుల వద్దకు రాలేదన్నారు.
తాను ఏమైనా ప్రభుత్వంలో ఉన్నానా అంటూ నిరుద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. తనకు మీకు ఎలాంటి సంబంధం లేదంటూ పేర్కొన్నారు. నా ఇంటికి వచ్చి అరవొద్దు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కోదండరాం రెడ్డి. దీంతో తన మాట తీరు పట్ల తీవ్రంగా మండిపడ్డారు నిరుద్యోగ బాధితులు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి మీరంతా కలిసి తమను మోసం చేశారని ఇప్పుడు స్పందించక పోతే ఎలా అని నిప్పులు చెరగారు బాధిత నిరుద్యోగులు.






