తెలంగాణ సర్కార్ కు పూర్తి నివేదిక అందజేత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ , సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. తన సారథ్యంలో ఏర్పాటైన కమిటీ గత కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. ఈ సందర్బంగా విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యలు, వసతుల కల్పన గురించి పూర్తి నివేదికను సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావుకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు నివేదికలో. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లకు భారీ ఎత్తున జీతాలు ఉన్నాయని పేర్కొన్నారు. వీరికి అందజేస్తున్న వేతనాలు రాష్ట్ర ఖజానాకు భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల మౌలిక వసతుల కల్పనకు ఇబ్బంది ఏర్పడుతుందన్నారు.
అందుకే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన వేతనాలను తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. జీతాలతో పాటు అలవెన్సులు కూడా తగ్గించాలన్నారు. ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్దీకరించాలని రేవంత్ రెడ్డికి అందజేసిన నివేదికలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్పష్టం చేశారు. దీంతో విద్యారంగం బలోపేతం చేయడం కష్టంగా మారుతుందన్నారు. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా తీసి వేయాలని స్పష్టం చేశారు.






