రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
అమరావతి : వైసీపీ పాలనలో నిధుల లేమితో పంచాయతీల్లో పాలన పడకేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. పాడైపోయిన వీధి బల్బులను సైతం మార్చడానికి కూడా వీలుండేది కాదన్నారు. చేసిన పనులకు బిల్లులు రాక పోవడంతో ఎందరో వైసీపీ సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వాపోయారు. మరెందరో చేసిన అప్పులు తీర్చడానికి కూలీలుగా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఆనాటి జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించారన్నారు. పంచాయతీలను దౌర్జన్యంగా గెలిపించు కోవడంలో ఉన్న శ్రద్ధ నిధులు ఇవ్వడంపై లేదని జగన్ నుద్దేశించి విమర్శించారు.
కూటమి ప్రభుత్వం రాకతో పంచాయతీలకు పూర్వ వైభవం ప్రారంభమైందని చెప్పారు మంత్రి ఎస్. సవిత. కేంద ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు నేరుగా పంచాయతీలకే అందజేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 22 నెలల కాలంలో గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి చోటు చేసుకుందన్నారు. 2025-26కు సంబంధించి గ్రామాల్లో జరిగిన అభివృద్ధికి గానూ ప్రతిష్టాత్మక అయిదు కేంద్ర ప్రభుత్వ అవార్డులను ఏపీ పంచాయతీరాజ్ శాఖ గెలుచుకుందని తెలిపారు. ఇదీ కూటమి ప్రభుత్వం పాలనకు మచ్చుతునక అని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





