నల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలినినో పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సీఎం ఆయా రాం గాయా రాం అనే రీతిలో వ్యవహరిస్తున్నారని, పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు. ఆ పార్టీలో ఎవరు ఎవరి మాట వినడం లేదన్నారు. ఇక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తారంటూ ప్రశ్నించారు జగదీశ్ రెడ్డి. ఇవాళ ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వర్షాభావ పరిస్థితులకు ప్రధాన కారణం ఎలినినో కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని పేర్కొన్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (NSP)లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరినప్పటికీ సాగు కోసం కాలువల్లోకి నీటిని విడుదల చేయబోమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ప్రస్తావించారు. ఆయకట్టులో నెలకొన్న కరువు వంటి పరిస్థితులకు కారణం ‘ఎల్ నినో’ ప్రభావం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఈ పరిస్థితిని సృష్టించిందని మాజీ మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. NSPలో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరినప్పటికీ సాగు కోసం కాలువల్లోకి నీటిని విడుదల చేయబోమని కోమటిరెడ్డి కామెంట్స్ చేయడం తగదన్నారు. వరి పంటను సేకరించడం , సన్న రకం వరికి బోనస్ చెల్లించడం వంటి బాధ్యతల నుండి తప్పించుకునేందుకే, రైతులు వరి సాగు చేయకుండా నిరుత్సాహ పరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని BRS ఎమ్మెల్యే ఆరోపించారు.





