21న ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తా
స్పష్టం చేసిన మాజీ మంత్రి
అమరావతి – మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఆయన ఇటీవల జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తో మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అనకాపల్లి నుంచి తాను ఎంపీగా బరిలో ఉండాలని చెప్పినట్టు సమాచారం. కానీ శనివారం కొణతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదన్నారు.
త్వరలో జరిగే శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా పోటీ చేయాలనే దానిపై ఆలోచిస్తున్నానని చెప్పారు. ఈనెల 21న ఆదివారం నాడు తాను ఏ పార్టీలో చేరుతాననే దానిపై స్పష్టత ఇస్తానని స్పష్టం చేశారు కొణతాల రామకృష్ణ. ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. ఏపీకి సంబంధించి సీనియర్ నాయకులలో ఒకరుగా గుర్తింపు పొందారు.
ఇదే సమయంలో తను పవన్ ను కలవడం ఒకింత విస్తు పోయేలా చేసింది. జనసేనలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే రామకృష్ణ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పడంతో ఆయనకు చెందిన అనుచరులు, అభిమానులు, నేతలు ఒకింత ఆందోళనలో ఉన్నారు.
ఇక ఈసారి ఏపీ ఎన్నికలు మరింత రంజుగా మారనున్నాయి. చతుర్ముఖ పోటీ జరగనుంది. అనూహ్యంగా వైఎస్ షర్మిల తెర పైకి వచ్చారు. ఆమె పీసీసీ చీఫ్ గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.