22న ఏపీలో ఓటర్ల తుది జాబితా
వెల్లడిస్తామన్న సీఈసీ రాజీవ్ కుమార్
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న శాసన సభ , పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను ఈనెల 22న ప్రకటిస్తామని స్పష్టం చేశారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై ఆరా తీశారు. ఈ మేరకు ఆయా పార్టీలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి 46,165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
ఓటర్లకు సంబంధించి చూస్తే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారని చెప్పారు సీఈసీ. మహిళా ఓటర్లు 2.07 కోట్లు ఉండగా పురుష ఓటర్లు 1.99 కోట్లు ఉన్నారని తెలిపారు. సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
తొలిసారి ఏపీలో ఇంటి వద్ద నుంచి 5.8 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించు కోనున్నారని సీఈసీ చెప్పారు. ఇక తొలిసారిగా 18 ఏళ్లు దాటిన ఓటర్లు 7.88 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వంద ఏళ్లు దాటిన వృద్దులు 1174 మంది ఉన్నారని పేర్కొన్నారు. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేస్తామన్నారు.