23 నుంచి షర్మిల ప్రచారం
ఇచ్చాపురం నుంచి ముహూర్తం
విజయవాడ – ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు వైఎస్ షర్మిలా రెడ్డి. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఏఐసీసీకి చెందిన సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఊహించని ఈ నిర్ణయంతో ఏపీలో ఒక్కసారిగా రాజకీయాలు మారి పోయాయి.
ఈ సందర్బంగా వైఎస్ షర్మిలా రెడ్డి ప్రసంగించారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలిగా తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టానని అన్నారు. ఆయన ఆశయాలు సాధించేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ప్రజల కోసం పని చేస్తానని, సమస్యలను ప్రస్తావిస్తానని ప్రకటించారు.
ఇదే సమయంలో త్వరలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు. వైఎస్సార్ కలల్ని నిజం చేసే సత్తా తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఈనెల 23 నుంచి జనంలోకి వెళతానని ప్రకటించారు. ఏపీలోని ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని సభా సాక్షిగా వెల్లడించారు ఏపీసీసీ చీఫ్.