25 నుంచి జనంలోకి జగన్
26 జిల్లాల్లో సభలకు ఏర్పాట్లు
అమరావతి – ఏపీలో ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టింది అధికారంలో ఉన్న వైసీపీ. ఈ మేరకు శుక్రవారం సంచలన ప్రకటన చేసింది. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనంలోకి వెళ్లనున్నారని తెలిపింది.
ఇందులో భాగంగా జనవరి 25 నుంచి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని వెల్లడించింది వైసీపీ . రాష్ట్రంలోని 26 జిల్లాలలో సభల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొంది. రోజుకు రెండు జిల్లాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తారని స్పష్టం చేసింది.
ఇప్పటికే పార్టీ హైకమాండ్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుందని తెలిపింది. జగన్ టూర్ కు సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్దం చేసిందని , ఈ ఎన్నికల ప్రచారం తొలుత రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర నుంచి పర్యటన మొదలవుతుందని పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లాలో మొదటి సభ జరుగుతుందని ఇప్పటికే పార్టీకి చెందిన బాధ్యులు , నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లు, సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు పూర్తిగా దృష్టి సారించారని తెలిపింది. ఇక ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు వైసీపీ తెలిపింది.