నాగార్జున సాగర్ కు భారీ వరద
ప్రాజెక్టు పూర్తి స్థాయి గేట్లు ఎత్తివేత
నల్లగొండ జిల్లా – ఎగువన కురుస్తున్న వర్షాల ధాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కళ కళ లాడుతోంది. భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో సాగర్ ప్రాజెక్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి 25 గేట్లను ఎత్తి వేశారు.
4 గేట్లు పది అడుగుల మేర, 22 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి 2,35,150 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు . ఇక సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో మొత్తం 2,85,168 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 589.00 అడుగులకు చేరింది.
పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 309.0570 టీఎంసీలకు చేరుకుందని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీంఎంసీలు గా ఉంది. భారీ ఎత్తున వరద ఉధృతి కారణంగా ప్రాజెక్టు నిండి పోవడంతో జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గేట్లు ఎత్తి వేసిన కారణంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పర్యాటకులు ఎవరూ దరిదాపుల్లోకి వెళ్ల రాదని హెచ్చరించారు ఉన్నతాధికారులు.