Sunday, April 20, 2025
HomeNEWSతెలంగాణలో 2జీ బయో ఇథనాల్‌ ప్లాంట్‌

తెలంగాణలో 2జీ బయో ఇథనాల్‌ ప్లాంట్‌

స్వచ్ఛ్ బయో రూ.1000 కోట్ల పెట్టుబడి

హైద‌రాబాద్ – బయో ఫ్యూయల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధపడింది. త్వరలోనే తెలంగాణలో సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయో ఫ్యూయల్ ప్లాంట్ నెలకొల్పనుంది. మొదటి దశలో దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంట్ నిర్మించనుంది. ఈ ప్లాంట్ ఏర్పాటులో 250 మందికి ప్రత్యక్షంగా, 250 మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ‌ద‌ర్ బాబు పాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందంతో స్వచ్ఛ్ బయో ఛైర్ పర్సన్ ప్రవీణ్ పరిపాటి చర్చలు జరిపారు.

స్వచ్ఛ బయోతో అంతర్జాతీయ భాగస్వామిగా ఉన్న సుగనిత్ బయో రెన్యువబుల్స్ కంపెనీ బయోమాస్, సెల్యులోజ్ నుండి జీవ ఇంధనాలు, జీవ రసాయనాలను ఉత్పత్తి చేసే పేటేంట్ పొందటంతో పాటు అవసరమైన సాంకేతికతను అభివద్ధి చేసింది.

ఈ కంపెనీ పెట్టుబడులు రాష్ట్రంలో సుస్థిరమైన, పర్యావరణ అనుకూలమైన వృద్ధికి దోహద పడనుంది. అందుకే పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ వికేంద్రీకృత అభివృద్ధి దృక్పథం తమను ఆకట్టుకుందని కంపెనీ ఛైర్మన్ ప్రవీణ్ పరిపాటి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవటం తమకు ఆనందంగా ఉందన్నారు.

రాబోయే కాలంలో మరిన్నిప్లాంట్లు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బయో ఫ్యూయల్స్ హబ్‌గా మార్చుతామ‌ని ప్ర‌క‌టించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments