225 సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు
ప్రకటించిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం దేశంలో ఉన్న 543 ఎంపీలలో 225 మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలిపింది. 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ల ఆధారంగా వివరాలు నమోదు చేసినట్లు పేర్కొంది.
సగానికి దగ్గరగా కేసులు నమోదు కావడం విశేషం. ఇక తీవ్రమైన కేసులతో సిట్టింగ్ ఎంపీలు 149 మంది ఉన్నారని వెల్లడించింది ఏడీఆర్. హత్యలు, హత్యా యత్నం, మత సామరస్యానికి భంగం కలిగించడం, కిడ్నాప్ లకు పాల్పడటం, మహిళలపై లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపింది ఏడీఆర్.
హత్యకు సంబంధించిన కేసులలో 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నట్లు పేర్కొంది. వీరిలో 5 మంది బీజేపీకి చెందిన వారు ఉండగా కాంగ్రెస్ నుంచి ఒకరు, బీఎస్పీ నుంచి మరొకరు, వైసీపీ నుంచి ఇంకొకరు ఉన్నారని స్పష్టం చేసింది. మరో స్వతంత్ర అభ్యర్థిపై కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపింది ఏడీఆర్.
హత్యాయత్నాకి సంబంధించిన కేసుల పరంగా చూస్తే 28 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారని అఫిడవిట్ లో తెలిపినట్లు పేర్కొంది. వీరిలో 21 మంది ఎంపీలు బీజేపీకి చెందిన వారు ఉండగా కాంగ్రెస్ , ఏఐటీసీ, బీఎస్పీ, శరద్ పవార్ కాంగ్రెస్, వైసీపీ, రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ, వీసీకే నుంచి ఒక్కో ఎంపీ ఉన్నారని తెలిపింది ఏడీఆర్.
మహిళలపై నేరాలకు పాల్పడిన వారిలో 16 మంది ఎంపీలు ఉన్నారని తెలిపింది. 294 మంది సిట్టింగ్ ఎంపీలలో 118 మంది ఎంపీలు బీజేపీ నుండి ఉన్నారు. 46 మంది కాంగ్రెస్ నుంచి , 24 మంది డీఎంకే , 8 మంది ఏఐటీసీకి చెందిన వారు ఉండగా , 12 మంది జేడీయూకు చెందిన ఎంపీలు , వైసీపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారని తెలిపింది ఏడీఆర్.