29వ తేదీ వరకు కొనసాగుతాయని టీటీడీ వెల్లడి
తిరుపతి – టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 522వ వర్థంతి ఉత్సవాలు మార్చి 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయని ఈవో జె. శ్యామల రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు. అన్నమయ్య జన్మ స్థలమైన తాళ్లపాక లోని ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద, తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో, తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
మార్చి 25వ తేదీ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా జరుగనుందని పేర్కొన్నారు. మార్చి 26న తిరుమలలో సాయంత్రం 6 గంటలకు నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మార్చి 26 నుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.