NEWSTELANGANA

బీజేపీ..కాంగ్రెస్ రెండూ ఒక్క‌టే

Share it with your family & friends

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

హైద‌రాబాద్ – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీకి ఎదురు దెబ్బ త‌గ‌ల‌క త‌ప్ప‌ద‌న్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరు పార్టీలు ఒక్క‌టేన‌న్నారు. రాహుల్ గాంధీ ఓ వైపు ఉంటే రేవంత్ రెడ్డి మ‌రో వైపు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. 420 హామీల‌ను అమ‌లు చేయ‌డంలో విఫ‌లం అయ్యారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

వరంగల్ తో పాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో ఆయన విడివిడిగా సమావేశం నిర్వహించారు. వరంగల్ లో చివరి క్షణంలో కడియం కుటుంబం పార్టీకి మోసం చేసిన వ్యవహారం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని తెలిపారు. కొందరు నాయకులు వలస వెళ్లినంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని వెల్లడించారు.

వరంగల్ నుంచి బీఆర్ఎస్ బరిలోకి దించిన డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ అభ్యర్థిత్వం పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు కేటీఆర్. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థి ఎంపిక జరిగిందని గుర్తు చేశారు. 2001 నుంచి కేసీఆర్ గారితో కలిసి నడిచిన సుధీర్ కుమార్ గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. చైతన్యానికి ప్రతీకైన వరంగల్ ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

ఇక పెద్దపల్లిలో కూడా గులాబీ గెలుపు ఖాయం అయి పోయిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మచ్చలేని నాయకుడిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.