కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన
నంద్యాల జిల్లా – తమ పార్టీకి కార్యకర్తలే పట్టు కొమ్మలంటూ స్పష్టం చేశారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. కార్యకర్తలు లేక పోతే పార్టీనే లేదన్నారు. వారు ఉండడం వల్లనే తాము ఈ స్థాయిలో ఉన్నామని పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల జిల్లా బేతంచర్లలో మంత్రి బుగ్గన పర్యటించారు. గతంలో గ్రామాలను, పట్టణాలను టీడీపీ సర్కార్ పట్టించు కోలేదన్నారు. కానీ ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలలో 99 శాతంకు పైగా అమలు పర్చడం జరిగిందని చెప్పారు . అభివృద్ది అంటే ఏంటో చూపిస్తానని , దమ్ముంటే సెంటర్ కు రావాలంటూ సవాల్ విసిరారు.
డోన్ లో పార్టీ మారిన వారికి ఎన్నికల తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. కూటమి తాటాకు చప్పుళ్లకు , ఉడత ఊపులకు భయపడేది లేదన్నారు. రాష్ట్రంలో పులివెందుల తర్వాత డోన్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది చెందిందన్నారు.
ఓడించారని ప్రజలను వదిలేసి వెళ్లి పోయిన కోట్ల అడ్రస్ ఎక్కడ అని ప్రశ్నించారు. బేతంచర్లలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.