వైఎస్ ఆశయాలకు జగన్ తూట్లు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తన తండ్రి , దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా పాలన చేయడం లేదని ఆరోపించారు. బుధవారం ఏపీ న్యాయ యాత్రలో భాగంగా పీలేరు, మదనపల్లి, తంబల్లపల్లి నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
తన తండ్రి వైఎస్సార్ కొన ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పని చేశారని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశారని అన్నారు. కానీ ఇవాళ ఆయన పేరు చెప్పుకుని అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టించు కోవడం లేదని ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి.
తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని పొట్టన పెట్టుకున్న వాళ్లకు, తీవ్రమైన ఆరోపణలు ఉన్న వాళ్లకు టికెట్ ఎలా ఇచ్చారంటూ నిలదీశారు . తన తండ్రి లాంటి నాయకుడు ఇంకా తెలుగు నేల మీద పుట్టలేదన్నారు. వైఎస్ సంక్షేమ పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి.