నిన్న అవమానం నేడు బహుమానం
సివిల్స్ లో సత్తా చాటిన ఉదయ్ కృష్ణా రెడ్డి
అమరావతి – ప్రకాశం జిల్లాకు చెందిన ఉదయ్ కృష్ణా రెడ్డి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. దీనికి కారణం ఆయన ఒకప్పుడు కానిస్టేబుల్ గా పని చేశాడు. ఆనాడు తను విపరీతమైన అవమానాలకు గురయ్యాడు. ప్రధానంగా తనపై అధికారి సీఐ వేధింపులు తాళలేక ఏకంగా కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఏదో ఒక రోజు సివిల్స్ రాయాలని, ఐఏఎస్ కావాలని ఆయన కల. దీనిని నిజం చేసేందుకు చాలా కష్టపడ్డాడు. చివరకు ర్యాంకు సాధించాడు.
యూపీఎస్సీ 2023కు సంబంధించి సివిల్స్ ర్యాంకులను ప్రకటించింది. మనోడికి దేశ వ్యాప్తంగా 780వ ర్యాంకు లభించింది. ఈ సందర్బంగా ఉదయ్ కృష్ణా రెడ్డి తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన గతం గురించి తెలిపాడు. సీఐ తనను 60 మంది పోలీసుల ముందు అవమానించాడని, దీంతో తట్టుకోలేక ఛాలెంజ్ గా తీసుకున్నానని చెప్పాడు.
2013 నుండి 2018 దాకా పోలీస్ కానిస్టేబుల్ గా పని చేశాడు. వ్యక్తిగత ద్వేషంతోనే తనను సీఐ అవమానించాడని తెలిపాడు. ప్రస్తుతం ఆయన సాధించిన ర్యాంకును బట్టి తనకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రావచ్చు. కానీ ఐఏఎస్ అయ్యేంత వరకు తాను నిద్రపోనంటూ ప్రకటించాడు ఉదయ్ కృష్ణా రెడ్డి.