జనం..బీజేపీతో జర భద్రం
హెచ్చరించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – పార్లమెంట్ ఎన్నికల వేళ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల దేశ భవిష్యత్తుకు సంబంధించినవని పేర్కొన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా దేశ ప్రజలకు వీడియో సందేశం ఇచ్చారు. గత కొంత కాలంగా ఈ దేశంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందన్నారు. కేవలం మతం ఆధారంగానే రాజకీయాలు కొనసాగుతున్నాయని, ఇది అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు.
ఏ దేశమూ ఎక్కువ కాలం కులం పేరుతో లేదా మతం పేరుతో లేదా జాతుల పేరుతో మనజాలదని గుర్తించాలని సూచించారు రాహుల్ గాంధీ. గతంలో ఎన్నడూ లేనంతగా దాడులు, దారుణాలు, మోసాలు, హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, వైట్ కాలర్ నేరాలు పెరిగి పోయాయని దీనికంతటికీ ప్రధాన కారణం గత 10 ఏళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఉండడమేనని ఆరోపించారు.
ఇవాళ అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారని, నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగి పోయిందని, కేవలం ప్రచార ఆర్భాటం తప్ప చేసింది ఏమీ లేదని ఆరోపించారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం రెండూ అత్యంత ప్రమాదంలో పడ్డాయని వాటిని కాపాడు కోవాలంటే మనందరం విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు .