మేం వాలంటీర్లకు వ్యతిరేకం కాదు
స్పష్టం చేసిన టీడీపీ నేత లోకేష్
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళగిరి నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజాగళం పేరుతో జన యాత్ర చేపట్టారు. భారీ ఎత్తున ఆదరణ లభించింది.
తాజాగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీడీపీలో చేరుతున్నారు. తాజాగా వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన వాలంటరీ వ్యవస్థపై ఇప్పటికే పలు సార్లు ఆరోపణలు చేశారు నారా లోకేష్. తాజాగా ఇదే నియోజకవర్గానికి చెందిన 9 మంది వాలంటీర్లు ఊహించని రీతిలో తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వెంటనే నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
వీరందరికీ పార్టీ తరపున కండువాలు కప్పి ఆహ్వానించారు నారా లోకేష్. ఈ సందర్బంగా వారిని ఉద్దేశించి ప్రసంగించారు. తమ కూటమి వాలంటర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజా సభలో బహిరంగంగానే వాలంటీర్లకు భరోసా ఇచ్చారని తెలిపారు. వారి వేతనాలను రెట్టింపు చేస్తానని హామీ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మీ భద్రతకు తాను భరోసా ఇస్తున్నట్లు తెలిపారు.