వేం నరేందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఫైర్
ఎన్నికల సభలో పాల్గొంటే ఎలా
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీకి చెందిన వేం నరేందర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారని, ప్రస్తుతం ఆ పదవి కేబినెట్ హోదా కలిగినదని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉందని తెలిపింది పార్టీ.
ఈ సందర్బంగా ఆయన పార్టీకి చెందిన నాయకుడై ఉన్నప్పటికీ అధికారిక హోదాలో ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొన కూడదని స్పష్టం చేసింది. దీనిని ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించిందని గుర్తు చేసింది.
అధికారిక ఉత్తర్వులతో సీఎం సలహాదారుడిగా ఉన్న వేం నరేందర్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ఒనగూరింది ఏమీ లేదని ఆరోపించింది. రాష్ట్ర ఖజానా నుండి జీత భత్యాలతో పాటు సకల సదుపాయాలు, సౌకర్యాలు పొందుతున్న సదరు వ్యక్తి పార్టీకి చెందిన సమావేశాలు, సభల్లో పాల్గొనడాన్ని తప్పు పట్టింది.
వెంటనే ఆయనను ప్రభుత్వ సలహాదారు పదవి నుండి తొలగించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న వారు ఎవరైనా సరే వారికి కూడా ఎన్నికల నియమావళి వర్తిస్తుందని స్పష్టం చేసింది. రూల్స్ బేఖాతర్ చేసిన వేం నరేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది.