కుమ్మక్కైన బాబు..రేవంత్
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి
అమరావతి – వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. ఈసారి ఆయన చంద్రబాబు నాయుడు, సీఎం రేవంత్ రెడ్డిలపై మండిపడ్డారు. ఒక ఓటుకు 5 కోట్ల బేరం కుదుర్చుకున్నారని, ప్రపంచం అంతా చూస్తూ ఉండగానే ఆడియో, వీడియోలతో పట్టుబడ్డ విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటు కేసులో బలమైన సాక్ష్యాలు ఉన్నాయని, కానీ చంద్రబాబు నాయుడు బయటకు రాకుండా తన స్థాయిలో మ్యానేజ్ చేస్తున్నాడని ఆరోపించారు. గత కొంత కాలం నుంచి ఆయనపై ఎన్నో కేసులు ఉన్నాయని, వాటిపై స్టే తెచ్చుకుంటూ గడుపుతున్నాడని ధ్వజమెత్తారు.
కాగా గత ఏడు సంవత్సరాలుగా ఈ ఓటుకు నోటు కేసును ముందుకు నడవకుండా అడ్డుకుంటున్నాడని చంద్రబాబు నాయుడిపై ధ్వజమెత్తారు ఆళ్ళ రామకృష్ణా రెడ్డి. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు వచ్చే జూలై 24 వరకు తుది గడువు ఇచ్చిందని, ఆ తర్వాత వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడుకు శిక్ష తప్పదన్నారు. ఇక సీఎంగా రేవంత్ రెడ్డి చాప్టర్ క్లోజ్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు.