భారత కూటమి గెలుపు ఖాయం
కేరళలో సీఎం రేవంత్ రెడ్డి
కేరళ – ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమి ఈసారి అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోకు భారీ స్పందన లభించింది. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రేవంత్ రెడ్డి.
ఈ దేశంలో వ్యవస్థలను సర్వ నాశనం చేసి, దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని కేవలం బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటోందన్నారు. మోదీ తాను మాత్రమే ప్రధానిగా ఉండాలని ఇక ప్రతిపక్షాలు లేకుండా చేయాలని ప్లాన్ చేశాడని, కానీ చరిత్ర ఆయనను క్షమించదన్నారు రేవంత్ రెడ్డి. కాలం ఒకే తీరుగ ఉండదన్నారు. ఏదో ఒక రోజు బదులు తీర్చుకుంటుందని సూచించారు.
ఇకనైనా మోదీ మారాలని, తాను ప్రకటించినట్లు 400 సీట్లు రావడం కలలోనే సాధ్యమవుతుంది తప్ప వాస్తవానికి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఎంత సేపు మతం పేరుతో ఓట్లు అడగడం తప్పితే ఏనాడైనా దేశం కోసం ప్రాజెక్టులు కట్టారా లేక పరిశ్రమలు ఏర్పాటు చేశారా అని నిలదీశారు రేవంత్ రెడ్డి.