రేవంత్ రెడ్డి తుపాకీ రాముడు
మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్
కరీంనగర్ జిల్లా – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బోయనపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్ షోకు అశేష స్పందన లభించింది.
అనంతరం జరిగిన సభలో హరీశ్ రావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం మాటలు చెప్పడంలో దిట్ట అని కానీ చేతల వరకు చూస్తే జీరో అంటూ ఎద్దేవా చేశారు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి ఓ తుపాకీ రాముడంటూ మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీల పేరుతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నారని , కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా వంద శాతం పూర్తి చేయలేక పోయిందన్నారు. గ్యారెంటీలు కావవి గారడీలని ఫైర్ అయ్యారు తన్నీరు హరీశ్ రావు.
ఆ స్కామ్ ఈ స్కామ్ అంటూ రేవంత్ రెడ్డి కాల యాపన చేస్తున్నాడని , ప్రజలను మభ్య పెట్టడం తప్పితే ఆయన ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదన్నారు . ఇకనైనా ప్రజలు గమనించాలని గులాబీని ఆదరించాలని కోరారు.