అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నాయకులు వాటిని నివృత్తి చేయాలన పేర్కొన్నారు. ప్రజలతో మమేకమయ్యే ఇంటింటికీ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ముఖ్యమంత్రి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , పార్టీ శ్రేణులను ఆదేశించారు. నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ప్రజలకు దూరం చేసే పనులకు దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. యువత సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేయాలని, అలాగే ‘గొడ్డలి గుర్తు పార్టీ’ (వైసీపీ) విధానాలు యువతపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపాయో వివరించాలని నాయుడు పార్టీ కార్యకర్తలకు సూచించారు. కేవలం డబ్బుతో ప్రజల మద్దతు పొందలేమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతిపక్ష విధానాలను ఎండగట్టడం ద్వారానే అది సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు.
సమాజంలో విభజనలు సృష్టించేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించిన నాయుడు, ప్రజలతో నిరంతరం మమేకం కావడం ద్వారా అటువంటి ప్రయత్నాలను సమర్థవంతంగా తిప్పికొట్టవచ్చని అన్నారు. సీనియర్ నాయకుల నుండి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రజలతో నిరంతరం సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ విజయాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా పార్టీ నాయకులు, శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమం 45 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ‘సూపర్-6’ హామీల అమలు గురించి వివరించాలని, అలాగే మహిళలు, రైతులు, యువత , విద్యార్థులకు అందిన ప్రయోజనాలను తెలియ జేయాలని అన్నారు. ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసి, తగిన చర్యల కోసం వాటిని పార్టీ , ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా చూడాలని స్పష్టం చేశారు.





