మోసం కాంగ్రెస్ నైజం – కేటీఆర్
ఆరు గ్యారెంటీలు కావవి గారడీలు
హైదరాబాద్ – ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వడం, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన శుక్రవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచారని పేర్కొన్నారు. ప్రధానంగా 2 లక్షల జాబ్స్ ఇస్తామని మామ మాటలు చెప్పారని, ఓట్లు వేశాక వాటి గురించి ఊసెత్తడం లేదన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహించిన వాటినే తిరిగి ఫలితాలు ప్రకటిస్తున్నారని , తామే భర్తీ చేసినట్లు గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో సీఎం అనే వ్యక్తి ఉన్నాడా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆ పార్టీలో సీఎం పదవికి పోటీ పడే వాళ్లేనని, ఇక ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు కేటీఆర్.
ఈ 120 రోజుల పాలనలో కాంగ్రెస్ సర్కార్ ఊహించని రీతిలో నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందన్నారు . పవర్ లోకి వచ్చాక నిరుద్యోగ భృతి నెలకు రూ. 4,000 ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పారని కానీ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు కేటీఆర్.
సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు .