NEWSTELANGANA

రేవంత్ ఖ‌బ‌డ్దార్ – సింగిరెడ్డి

Share it with your family & friends

మాజీ మంత్రి సీరియ‌స్ కామెంట్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ గురించి, నాయ‌కుడు కేసీఆర్ గురించి ఇంకోసారి నోరు జారితే జాగ్ర‌త్త అని హెచ్చ‌రించారు. ప‌ద‌వి ఉంద‌నే గ‌ర్వంతో విర్ర‌వీగితే ఎలా అని ప్ర‌శ్నించారు. శుక్ర‌వారం సింగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ వేదిక‌గా కారు గ్యారేజ్ కు వెళ్ల‌డం ఖాయ‌మంటూ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు.

నాలుగు నెల‌ల‌కే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కాయ‌ని అన్నారు. నాలుక మంద‌మెక్కింద‌న్నారు నిరంజ‌న్ రెడ్డి. పాల‌మూరుకు ప‌ట్టిన దరిద్ర‌మే కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. నాలుగున్నర దశాబ్దాలు పాలించి పాలమూరును వలసల జిల్లాగా చేసింది.. 14 లక్షల మంది వలస పోయేలా చేసింది మీ పార్టీ కాదా అని నిల‌దీశారు.

తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి జూరాల, కేఎల్ఐ కింద 13 వేల ఎకరాలు మినహా ఉమ్మడి పాల‌మూరు జిల్లాలో ఎక్కడా సాగు నీళ్లు ఇచ్చింది లేదన్నారు. 2006లో జొన్నలబోగుడ, గుడిపల్లి రిజర్వాయర్లు పూర్తయితే 2014 వరకు వాటిని గాలికి వదిలేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్ర‌శ్నించారు.

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పాలమూరు జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీళ్లు అందించిన ఘనత కేసీఆర్ గారిదన్నారు. చివ‌రి భూముల వ‌ర‌కు సాగు నీరు ఇచ్చిన ఘ‌న‌త కూడా త‌మ స‌ర్కార్ దేన‌ని చెప్పారు.

తాము ఇచ్చిన‌ 30 వేల ఉద్యోగాలను తానొచ్చిన మూడు నెలలలో భర్తీ చేశానని చెప్పుకోవడానికి రేవంత్‌కు సిగ్గుండాలన్నారు. 20 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉండి పోయిన విషయం గుర్తుంచు కోవాల‌న్నారు.

ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే జనం కాంగ్రెస్‌ను బండకేసి కొడతారని హెచ్చ‌రించారు. కేసీఆర్ మంజూరు చేసిన విద్యా సంస్థలను కొడంగల్‌కు తెచ్చు కోవడం తప్ప రేవంత్ ధరఖాస్తు పెట్టింది లేదు.. దమ్మిడి తెచ్చింది లేదన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మినహా ఇప్పటి వరకు కాంగ్రెస్ చేసింది ఏమీ లేదన్నారు నిరంజ‌న్ రెడ్డి.