కాంగ్రెస్ అంటేనే కష్టాలు..కన్నీళ్లు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్
నాగర్ కర్నూల్ జిల్లా – బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి తో పాటు కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. నాలుగు నెలల పాలనలో కరెంట్ కష్టాలు, తాగు నీటికి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో జనాన్ని నిట్ట నిలువునా మోసం చేసిందని ఆరోపించారు.
2 లక్షల జాబ్స్ భర్తీ చేస్తామని చెప్పిన తుపాకీ రాముడు సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పాడని మండిపడ్డారు. పాలన గాడి తప్పిందని, నిరుద్యోగులు మరోసారి మోస పోయారని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి గొంతు విప్పే నాయకుడు ఈ జిల్లాలో లేరన్నారు. తనకు ఛాన్స్ ఇస్తే మీ తరపున పార్లమెంట్ లో వినిపిస్తానని చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.