కుప్పంకు రుణపడి ఉన్నా
నారా చంద్రబాబు నాయుడు
చిత్తూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న స్వంత నియోజకవర్గం కుప్పం. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతం పెట్టని కోటగా టీడీపీకి ఉంటూ వస్తోంది. 1983 నుంచి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి గంప గుత్తగా ఇక్కడి ప్రజలు పసుపుకు ఓటు వేస్తూ వస్తున్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి టీడీపీ చాలా సీట్లను కోల్పోయింది. కానీ కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడుకు పట్టం కట్టారు ఇక్కడి ప్రజలు. తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించు కునేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఈసారి టీడీపీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కూటమి తరపున చంద్రబాబు కుప్పం బరిలో మరోసారి నిలిచారు.
ఆయన ప్రస్తుతం ప్రజా గళం పేరుతో బిజీగా ఉన్నారు. రాష్ట్రం అంతటా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయన తరపున తన భార్య నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున జనం స్వచ్చంధంగా హాజరయ్యారు. మీరు కురిపించిన ప్రేమాభిమానాలు తనను మరింత ఉత్సాహ వంతుడిని చేసిందని, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనంటూ భావోద్వేగానికి లోనయ్యారు చంద్రబాబు నాయుడు.