భారీగా బోగస్ ఓట్ల తొలగింపు
ప్రకటించిన సీఈఓ వికాస్ రాజ్
హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ ఎత్తున బోగస్ ఓట్లను తొలగించినట్లు చెప్పారు. విచిత్రం ఏమిటంటే ఈ బోగస్ ఓట్లు ఎక్కువగా బడా బాబులు, ధనవంతులు ఉన్న జూబ్లీ హిల్స్ తో పాటు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న చాంద్రాయణ్ గుట్టలో అత్యధికంగా దొంగ ఓట్లు నమోదై ఉండడం విస్తు పోయేలా చేసింది.
హైదరాబాద్ పరంగా చూస్తే బోగస్ ఓటర్ల జాబితాలో టాప్ లో ఉన్నాయి ఈరెండు నియోజకవర్గాలు. హైదరాబాద్ లో ఏకంగా 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లు ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 33 లక్షల ఓట్లను తొలగించినట్లు చెప్పారు ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్.
ఎన్నికల జాబితా ప్రక్షాళనలో భాగంగా తెలంగాణలో గత రెండేళ్లలో భారత ఎన్నికల సంఘం 32.8 లక్షల మంది ఓటర్లను తొలగించిందని తెలిపారు. అయితే ఇదే క్రమంలో గత రెండు సంవత్సరాల కాలంలో కొత్తగా 60.6 లక్షల మంది ఓటర్లు చేరారని ఎన్నికల ప్రధాన అధికారి వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లా ఎన్నికల కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 60,953 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 3,101 మంది మరణించిన ఓటర్లు, 53,012 మంది వ్యక్తులు తరలివెళ్లారు.
చాంద్రాయణగుట్ట , యాకుత్‌పురాలో వరుసగా 59,289, 48,296 బోగస్ ఓట్లు ఉన్నట్లు తేలిందన్నారు.