DEVOTIONAL

21 నుండి శ్రీ‌వారి సాల‌క‌ట్ల ఉత్స‌వాలు

Share it with your family & friends

23వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతాయ‌న్న టీటీడీ

తిరుమ‌ల – తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది.

ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగు మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

రెండవ రోజు 22న సోమ‌వారం శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామి వారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరు మాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.

చివరిరోజు 23న మంగ‌ళ వారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.

వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.

వసంతోత్సవాన్ని పురస్కరించుకొని అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.