సేమ్ సీన్ బెంగళూరు పరేషాన్
ఉత్కంఠ భరిత పోరులో ఓటమి
కోల్ కతా – ఐపీఎల్ 2024 సీజన్ లో తాడో పేడో తేల్చు కోవాల్సిన సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు అంచుల దాకా వచ్చి బోల్తా పడింది. ఒక రకంగా అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఆర్సీబీకి ఏదీ అచ్చి రావడం లేదు. పరాజయ పరంపర కొనసాగుతూనే ఉంది. మరో వైపు గత సీజన్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆకాశమే హద్దుగా చెలరేగుతోంది.
ఇది పక్కన పెడితే కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ బంతి బంతికి ఏం జరుగుతుందనే టెన్షన్ కలుగ చేసింది. ఐపీఎల్ లోని మజా ఏమిటో చూపించింది.
ఆర్సీబీ జెర్సీ మారినా దాని తల రాత మారడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది ఆర్సీబీ. బంతికి బ్యాట్ కు మధ్య ఆసక్తికర పోరు మరింత ఆశ్చర్యాన్ని కలుగ చేసింది అభిమానులకు.
తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 222 రన్స్ చేసింది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ చివరి దాకా పోరాడింది. విల్ జాక్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 55 రన్స్ చేశాడు. రజత్ పాటిదార్ 1 ఫోర్ 5 సిక్సర్లతో దుమ్ము రేపాడు. 23 బంతుల్లో 52 రన్స్ చేశాడు. దినేష్ కార్తీక్ 3 ఫోర్లు ఒక సిక్స్ తో 25 రన్స్ చేస్తే కరణ్ శర్మ 7 బంతులు ఎదుర్కొని 3 సిక్సర్లు బాది 20 రన్స్ చేశాడు. చివరి బంతికి అద్భుతమైన రనౌట్ తో పరాజయం పాలైంది ఆర్సీబీ.
ఇక కోల్ కతా విషయానికి వస్తే కెప్టెన్ అయ్యర్ 7 ఫోర్లు ఒక సిక్స్ తో 50 రన్స్ చేశాడు. సాల్ట్ కేవలం 14 బంతులు మాత్రమే ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. ఇక జట్టులో కీలక పాత్ర పోషించాడు ఆండ్రూ రస్సెల్. 20 బంతులు ఆడి 4 ఫోర్లతో 27 రన్స్ చేసి నాటౌట్ గా నిలవడమే కాదు ప్రత్యర్థి బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించడంలో సత్తా చాటాడు. 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.