జగన్ పాలనపై షర్మిల ఫైర్
హత్యలు..అత్యాచారాలకు కేరాఫ్
కర్నూలు జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ న్యాయ యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా నంద్యాలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నంద్యాల ఎమ్మెల్యేపై మండిపడ్డారు.
జగన్ రెడ్డి పాలనలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దౌర్జన్యాలు తప్ప ఏమీ లేవన్నారు. పాలన గాడి తప్పిందన్నారు. అడ్డు వచ్చిన వారిని అడ్డంగా తొలగించుకుంటూ పోయేందుకేనా మీకు ఓటు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
అధికారంలో ఉంటే చంపడమేనా అని ప్రశ్నించారు. ఇందు కోసమేనా వైసీపీకి పవర్ ను కట్ట బెట్టిందంటూ మండిపడ్డారు. కుందునది వరదలు వస్తే నంద్యాల మునిగి పోతుందన్నారు ఏపీ పీసీసీ చీఫ్. వరదలు రాకుండా కాలువ విస్తరిస్తానని చెప్పాడని , సీఎం జగన్ రెడ్డి మరిచి పోయాడంటూ ఎద్దేవా చేశారు. నంద్యాల చుట్టూ రింగ్ రోడ్డు అంటూ ఊదర గొట్టారని అది ఏమైందని ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇచ్చిన హామీలు మరిచి, హత్యలు, దారుణాలకు పాల్పడుతున్న వైసీపీ నేతలకు మళ్లీ ఓటు వేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు.