14 సీట్లు గెలిస్తే రాజీనామా చేస్తా
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మరింత రసకందాయంగా మారింది. నువ్వా నేనా అనే స్థితికి చేరుకుంది. ఇటీవలే జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో గులాబీ వాడి పోయింది. ఎవరూ ఊహించని రీతిలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. నిన్నటి దాకా బీఆర్ఎస్ హవా చెలాయిస్తే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య వార్ గా మారి పోవడంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్దం మొదలైంది.
పార్లమెంట్ ఎన్నికలయ్యాక ప్రభుత్వం ఉంటుందో లేదోనంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కామెంట్ చేయడం కలకలం రేపింది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కూడా రేవంత్ సర్కార్ కూలి పోతుందని జోష్యం చెప్పారు. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీకి అంత సీన్ లేదన్నారు.
అయితే విచిత్రం ఏమిటంటే ఆయన ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇది సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా బీజేపీ ఎల్పీ నేత , ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ లో నోటుకు ఓటు సంక్షోభం తప్పదన్నారు.
ఇక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక రాష్ట్రంలో 14 సీట్లు గెలిస్తే తాను పార్టీకి, పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు మహేశ్వర్ రెడ్డి.