జగన్ ఏపీకి ఏం చేశారో చెప్పు
సవాల్ విసిరిన వైఎస్ షర్మిల
ఒంగోలు జిల్లా – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు జిల్లాలో పర్యటించారు. ఎర్రగొండ పాలెం ఎమ్మెల్యేపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఏపీకి ఏం చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
వైఎస్సార్ పేరు చెప్పి పవర్ లోకి వచ్చాక ఆయన ఆశయాలను అమలు చేయడంపై మరిచి పోయారని మండిపడ్డారు. కమీషన్లు ఇవ్వనిదే పనులు జరగని పరిస్థితి నెలకొందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు.
పని చేయని వాళ్లకు, మోసం చేసే వాళ్లకు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీకి పాల్పడే వాళ్లకు ఎలా టికెట్లు ఇచ్చారంటూ ప్రశ్నించారు వైఎస్ షర్మిలా రెడ్డి. జగన్ ఓటు వేసిన పాపానికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో చెప్పాలన్నారు.
వెలుగొండ ప్రాజెక్టు వైఎస్ఆర్ కలల ప్రాజెక్టు అని చెప్పారు. దాదాపు నాలుగున్నర ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. కానీ జగన్ రెడ్డి దీనిపై ఫోకస్ పెట్టలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే దాదాపు 15 లక్షల మందికి పైగా తాగు నీటి సౌకర్యం అంది ఉండేదన్నారు.
అధికారంలోకి వచ్చాక 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఐదేళ్లు పూర్తి కావస్తున్నా తట్టెడు మట్టి పోయలేదంటూ ఎద్దేవా చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.