ఘనంగా కళ్యాణ వేదిక
వడ్ల గింజలతో పూల పరద
ఒంటిమిట్ట – ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయం ఉట్టి పడేలా కల్యాణ వేదికను అందంగా తీర్చిదిద్దారు. వేదిక రంగు రంగుల పుష్పాలు, ఫలాలతో చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు ఫలపుష్పాల అలంకరణ చూసి ముగ్ధులయ్యారు.
ప్రత్యేకంగా వడ్ల గింజలతో పూల పరధ ఏర్పాటు చేశారు, చెరుకులు, టెంకాయ గెలలు, టెంకాయ కీతలు, టెంకాయపూత, అరటి ఆకులు, మామిడాకులు, మామిడికాయలు, ద్రాక్ష, తదితర ఫలాలు, చిలకలు, నీలం ఆర్కిడ్, రెడ్ ఆంథూరియం, హైడ్రామ్ జియా, జిప్సోఫల, తదితర విదేశీ జాతుల పుష్పాలతో కల్యాణ వేదికను అలంకరించారు.
ఇందుకోసం 4 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 30 వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. టీటీడీ ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు పర్యవేక్షణలో కలకత్తా, బెంగుళూరు, హైదరాబాదుకు చెందిన 100 మంది అలంకరణ నిపుణులు, 100 మంది టీటీడీ సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.