SPORTS

రాజ‌స్థాన్ జైత్ర యాత్ర

Share it with your family & friends

9 వికెట్ల తేడాతో గెలుపు

రాజ‌స్థాన్ – ఐపీఎల్ 2024లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ఆ జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 8 మ్యాచ్ లు ఆడి 7 మ్యాచ్ ల‌లో గెలుపొందింది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో కొన‌సాగుతోంది. కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్ సార‌థ్యంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రాజ‌సాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంటోంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపుతోంది.

రాజ‌స్థాన్ లోని జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరు ఏక ప‌క్షంగా సాగింది. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 179 ప‌రుగులు చేసింది.

హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకానొక ద‌శ‌లో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న జ‌ట్టును ఆదుకున్నాడు . 45 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 65 ర‌న్స్ చేశాడు. నెహాల్ ప‌ధేర 24 బాల్స్ ఆడి 49 ర‌న్స్ చేశాడు. ఒక్క ప‌రుగు తేడాతో హాఫ్ సెంచ‌రీ మిస్ అయ్యాడు. ఇందులో 3 ఫోర్లు 4 సిక్స‌ర్లు ఉన్నాయి. కెప్టెన్ పాండ్యా మ‌రోసారి నిరాశ ప‌రిచాడు.

గాయం కార‌ణంగా ఆడ లేక పోయిన సందీప్ శ‌ర్మ తిరిగి వ‌చ్చాక స‌త్తా చాటాడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను క‌ట్ట‌డి చేశాడు. 4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 18 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఇక మ‌రో కీల‌క బౌల‌ర్ బౌల్ట్ 32 ర‌న్స్ ఇచ్చి 2 కీల‌క వికెట్లు కూల్చాడు.

అనంత‌రం 180 ప‌రుగుల ల‌క్ష్యంతో రంగంలోకి దిగింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. జోష్ మీదున్న జోస్ బ‌ట్ల‌ర్ , జైశ్వాల్ దూకుడుగా ఆడారు. మ‌ధ్యలో వ‌ర్షం కార‌ణంగా ఆట నిలిచి పోయినా త‌ర్వాత తిరిగి ప్రారంభ‌మైంది. టార్గెట్ ను అవ‌లీల‌గా ఛేదించారు. జైశ్వాల్ 60 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 104 ర‌న్స్ చేశాడు.

జోస్ బ‌ట్ల‌ర్ 35 ప‌రుగుల‌కు చావ్లా బౌలింగ్ కు చిక్కాడు. ఇక బ‌ట్ల‌ర్ , జైశ్వాల్ తొలి వికెట్ కు 74 ర‌న్స్ చేశారు. గ‌త కొన్ని మ్యాచ్ ల‌లో అంత‌గా రాణించ‌ని య‌శ‌స్వి దుమ్ము రేపాడు ఈ మ్యాచ్ లో. ఆ త‌ర్వాత మైదానంలోకి వ‌చ్చిన కెప్టెన్ సంజూ శాంస‌న్ ఎక్క‌డా తొట్రు పాటుకు లోను కాకుండా జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. త‌ను 38 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇద్ద‌రూ క‌లిసి మ‌రో వికెట్ పోకుండా 18.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని పూర్తి చేశారు.