బీజేపీకి ఎమ్మెల్సీ నంజుండి గుడ్ బై
డీకే శివకుమార్ సమక్షంలో చేరిక
బెంగళూరు – సార్వత్రిక ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి కన్నడ నాట కోలుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, విశ్వ కర్మ సామాజిక వర్గానికి చెందిన శాసన మండలి సభ్యుడు నంజుండి తాను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇక ఎంత మాత్రం ఆ పార్టీలో ఉండలేనంటూ తెలిపారు.
రేపు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సమక్షంలో తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు నంజుండి. గత కొంత కాలంగా తన పట్ల పార్టీకి చెందిన కొందరు నేతలు చూసీ చూడనట్టుగా ఉంటున్నారని వాపోయారు.
పార్టీ వల్ల తన నుంచి లాభం కలిగిందని, కానీ బీజేపీ వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదన్నారు . ఇదిలా ఉండగా కర్ణాటకలో బలమైన లింగాయత్ సామాజికవర్గంతో పాటు విశ్వ కర్మీయులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామిని ఎక్కువగా కొలుస్తారు. ఇదే సమయంలో కన్నడ నాట కూడా ఆయనకు ఎక్కువ మంది భక్తులు ఉన్నారు.
కర్ణాటకలో ఆభరణాల షాపులు కలిగి ఉన్న వ్యాపారిగా గుర్తింపు పొందారు నంజుండి. ఒక రకంగా పార్టీకి బిగ్ షాక్ అని చెప్పక తప్పదు.